మానవ జీవితము యొక్క మర్మము

మానవ జీవితము యొక్క మర్మము

నీవెందుకు ఈ లోకములో జీవిస్తున్నావని మరియు నీ జీవితము యొక్క ఉద్ధేశ్యము ఏమిటని నీవెప్పుడైనా ఆలోచించావా? ఈ మర్మాన్ని విప్పుటకు ఆరు తాళపు చెవులు ఉన్నాయి.

1. దేవుని ప్రణాళిక

దేవుడు, మానవుని ద్వారా తన్ను తాను వ్యక్తపరచుకొనవలెనని కోరుచున్నాడు (రోమా. 8:29). ఈ ఉద్దేశ్యము నిమిత్తము ఆయన మనిషిని తన స్వరూపములోనే చేసెను (ఆది. 1:26). చెయ్యిని కలిగియుండుటకు చేతితొడుగును చెయ్యి యొక్క స్వరూపములో చేసినట్లే, మానవుడు కూడ దేవుణ్ణి కలిగి ఉండుటకు దేవుని స్వరూపములో చేయబడెను. దేవుణ్ణి తన మూలాంశముగా స్వీకరించినయెడల మనిషి దేవుణ్ణి వ్యక్తపరచగలడు (2 కొరి. 4:7).

2. మానవుడు

దేవుడు, తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మనిషిని ఒక పాత్రగా తయారు చేసెను (రోమా. 9:21-24). ఈ పాత్ర మూడు భాగములు కలిగి ఉంది. అవి: శరీరము, ప్రాణము మరియు ఆత్మ (1 థెస్స. 5:23). శరీరము భౌతిక సంబంధమైన మండలాన్ని తాకగలదు మరియు దానిని పొందుకొనగలదు. మానసిక శక్తి అయిన ప్రాణము, మానసిక మండలమును (విషయాలను) తాకగలదు మరియు వాటిని పొందుకొనగలదు. ఇక అత్యంత లోపలి భాగమైన ‘మానవాత్మ’ దేవునినే తాకుటకు మరియు పొందుకొనుటకు చేయబడింది (యోహాను 4:24). మానవుడు కేవలము తన కడుపులో ఆహారాన్ని కలిగి ఉండుటకు, లేదా తన మనస్సులో జ్ఞానము కలిగి ఉండుటకు మాత్రమే సృష్ఠించబడలేదు గాని తన ఆత్మలో దేవుణ్ణి కలిగి ఉండుటకు సృష్ఠించబడ్డాడు (ఎఫెసీ 5:18).

3. మానవుని పతనము

మానవుడు, తన ఆత్మలోనికి దేవుణ్ణి జీవముగా తీసుకొనక ముందే పాపము మానవునిలో ప్రవేశించింది (రోమా. 5:12). పాపము, తన ఆత్మను చంపివేసింది (ఎఫె. 2:1), తన మనస్సులో దేవునికి శత్రువుగా చేసింది (కొలొ. 1:21), మరియు తన శరీరాన్ని పాప శరీరముగా మార్చి వేసింది (ఆది. 6:3; రోమా. 6:12). కావున, పాపము మానవుని యొక్క అన్ని భాగములను పాడుచేసి, దేవుని నుండి అతనిని వేరుచేసింది. ఇటువంటి స్థితిలో మానవుడు దేవుణ్ణి పొందుకొనలేడు.

4. దేవుని వితరణ (పంపిణీ) కొరకు క్రీస్తుని విమోచనము

అయినప్పటికీ, మానవుని పతనము, దేవుడు తన అనాది సంకల్పాన్ని జరిగించకుండా ఆటంకపరచలేకపోయింది. తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకొనుటకొరకు, దేవుడు మొదటిగా యేసుక్రీస్తు అనే నరుడాయెను (యోహాను 1:1, 14). తరువాత మానవుణ్ణి విమోచించుటకు క్రీస్తు సిలువమీద మరణించెను (ఎఫెసి 1:7), తద్వారా మానవుని పాపమును తీసివేసి (యోహాను 1:29) అతణ్ణి దేవుని యొద్దకు మరలా తెచ్చుచున్నాడు (ఎఫె. 2:13). చివరిగా, పునరుత్థానమునందు ఆయన జీవమిచ్చు ఆత్మ ఆయెను (1 కొరి. 15:45); తద్వారా తన అపరిమితమైన, సమృద్ధియగు జీవమును మనిషి ఆత్మలోనికి పంపిణీ చేయగలవాడాయెను (యోహాను 20:22; 3:6).

5. మానవుని పునర్జన్మ

క్రీస్తు జీవమిచ్చు ఆత్మ ఆయెను గనుక, మానవుడు ఇప్పుడు దేవుని జీవమును తన ఆత్మలోనికి పొందుకొనగలడు. బైబిలు దీనినే పునర్జన్మ అని చెపుతుంది (1 పేతు. 1:3; యోహాను 3:3). ఈ జీవాన్ని పొందుకొనుటకు మానవుడు దేవుని వైపు తిరిగి మారుమనస్సు పొంది, యేసుక్రీస్తునందు విశ్వాసము నుంచవలసిన అవసరం ఉంది (అపొ. 20:21; 16:31).

పునర్జన్మింపబడుటకు, ప్రభువుయొద్దకు తెరవబడిన మరియు నిజాయితీతో కూడిన హృదయముతో వచ్చి ఈ క్రిందివిధముగా ఆయనతో చెబితే చాలు.

యేసుప్రభువా! నేనొకపాపిని. నాకు నీవు కావాలి. నాకొరకు చనిపోయినందుకు నీకు కృతజ్ఞతలు. యేసు ప్రభువా, నన్ను క్షమించుము. నా సమస్త పాపములనుండి నన్ను పవిత్రపరచుము. నీవు మృతులలోనుండి లేచావని నమ్ముతున్నాను. నేనిప్పుడే నిన్ను నా జీవముగాను, రక్షకుడిగాను స్వీకరిస్తున్నాను. నాలోనికి రమ్ము! నీ జీవముతో నన్ను నింపుము! యేసుప్రభువా, నా జీవితాన్ని నీ ఉద్ధేశ్యము కొరకు నీకే సమర్పిస్తున్నాను.

6. దేవుని సంపూర్ణ రక్షణ

పునర్జన్మింపబడిన తరువాత, ఒక విశ్వాసి బాప్తిస్మం పొందుట అవసరం (మార్కు 16:16). అప్పుడు జీవముగా ఉన్న దేవుడు విశ్వాసి ఆత్మలోనుండి, అతని ప్రాణములోనికి క్రమక్రమముగా తన్నుతాను వ్యాపింపజేసుకొనుట అనే జీవితాంతపు ప్రక్రియను ప్రారంభిస్తాడు (ఎఫె. 3:17). ఈ ప్రక్రియను రూపాంతరించబడుట అంటాము (రోమా. 12:2). దీనికి మానవుని సహకారము అవసరము (ఫిలి. 2:12). ఆ విశ్వాసి తన కోరికలు, ఆలోచనలు మరియు నిర్ణయాలు క్రీస్తుతో ఏకమయ్యేంత వరకు తన ప్రాణములోనికి ప్రభువు వ్యాప్తి చెందుటకు ప్రభువును అనుమతించుటవలన అతడు సహకరించును. చివరిగా, క్రీస్తు మరల వచ్చినపుడు, దేవుడు ఆ విశ్వాసి యొక్క శరీరాన్ని తన జీవముతో పూర్తిగా నింపును. దీనిని మహిమపరచ బడుట అంటాము (ఫిలి. 3:21). అతడు ఖాళీగాను, తన ప్రతిభాగము పాడైపోవుటకు బదులుగా ఈ మనిషి దేవుని జీవంతో నింపబడును మరియు పూర్తిగా ఆ జీవముతో ఆక్రమించబడును. ఇదియే దేవుని సంపూర్ణ రక్షణ! ఈ విధమైన మనిషి ఇప్పుడు దేవుని వ్యక్తపరచగలడు, దేవుని ప్రణాళికను నెరవేర్చగలడు!

ఒక విశ్వాసి ఈ జీవమును పొందుకొనిన తరువాత, పోషింపబడుటకు మరియు దేవుని జీవ సరఫరా ద్వారా అతడు ఈ జీవములో ఎదుగుటకు, పరిపక్వత పొందుటకు క్రైస్తవ సహవాసముకు హాజరు కావలెను. ఈ విశ్వాసి క్రీస్తు దేహములో గల ఇతర విశ్వాసులతో కలసి సహవాసము చేయుట ద్వారా క్రీస్తు సన్నిధి యొక్క ఐశ్వర్యములను ఆస్వాదించగలడు.

ఇది Basic Elements of the Christian Life, Vol. 1 లోని మొదటి అధ్యాయము, దీనిని చదువుటను కొనసాగించుటకు మీ ఉచిత కాపీని కోరవచ్చును.


ఇతరులతో పంచుకొనండి