సమాధానము మరియు భద్రత

సమాధానము మరియు భద్రత

వారు సమాధానమున్నది, భద్రత ఉన్నదని చెప్పుకొనుచుండగా, …వారిమీదికి ఆకస్మికముగా నాశనము తటస్థించును…” (1 థెస్స. 5:3)

మనకు సమాధానమును భద్రతను ఇచ్చుటకు మానవ సమాజము ఉద్దేశించబడినది. సమాధానము, భద్రత లేకుండా మన జీవితములు భయములోను సంశయములోను గడచిపోవును. మన ప్రభుత్వము మనకు క్షేమమును చేకూర్చుటకు వాగ్దానము చేసెను; మన ఆసుపత్రులు, వైద్యశాలలు మన ఆరోగ్యము, శారీరకమైన శ్రేయస్సు కొరకు ప్రయత్నించుచుండగా, మన బ్యాంకులు మరియు ఇతర ఆర్ధిక సంస్థలు మన పొదుపులకును పెట్టుబడులకును భద్రతను వాగ్దానము చేసెను. అయితే తుదకు, మన ప్రభుత్వము, మన ఆర్ధిక సంస్థలు, మన ఆరోగ్య భద్రతా వ్యవస్థ, మరియు మనము ఆధారపడుతున్న ఇతరమైనవి అనేకము, వాగ్దానము చేసినట్టి భద్రతను ఎంతమేరకు నిజముగా మనము పొందుచున్నాము?

మనము తగినంత పరిశీలన మరియు సావధానమైన విచారణ చేసినచో, మనము నమ్మి ఆధారపడుచూ వచ్చిన ప్రతి ఒక్కరూ మరియు ప్రతీది మనకు పరిపూర్ణమైన సమాధానమును భద్రతను ఇవ్వలేకపోయెను. యుద్ధము, కరువు, రోగము, నేరము, మరియు అవినీతి అనువాటితో పీడించబడుచున్న ప్రపంచములో, మనకు నిత్యమైన సమాధానమును భద్రతను హామీ ఇవ్వగలుగునది ఏదియూ మానవ సమాజములో లేదు. బైబిల్ కూడా మనకు చెప్పుచున్నదేమనగా “వారు సమాధానమున్నది, భద్రత ఉన్నదని చెప్పుకొనుచుండగా, …వారిమీదికి ఆకస్మికముగా నాశనము తటస్థించును…” (1 థెస్స. 5:3).

దేవుని వాక్యము ప్రకారముగా, నిజమైన సమాధానమును భద్రతను యేసుక్రీస్తులోను ఆయన నిత్యజీవములోను మాత్రమే కనుగొనగలము. దేవుడు తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను 3:16 లో చూచెదము. ఇక్కడ చెప్పబడిన నిత్యజీవము దైవికజీవము, సృష్టించబడని దేవుని జీవము, ఇది కాలమును బట్టి శాశ్వతమైనది మాత్రమే కాదు అయితే స్వభావములో నిత్యమైనది మరియు దైవికమైనది. ఈ జీవము స్వయానా దేవుడే, మరియు ఆయన జీవము నశింపజాలనది (యోహాను 14:6). దేవునికి మించిన నిత్యమైన భద్రత ఏదియూ లేదు.

మనకు సమాధానమును భద్రతను చేకూర్చుటకు సంభందించిన సమస్యలన్నియు తుదకు క్రీస్తులో మాత్రమే పరిష్కరించబడెను. అనేకమైన మూలముల నుండి–రోగము మరియు అంటువ్యాధుల నుండి, ఆర్ధిక వ్యవస్థ పతనము నుండి, దొంగిలించుట, చంపుట, మరియు నాశనము చేయుట వంటి వాటిని చేయు నేరగాళ్ళ నుండియూ టెర్రర్రిస్టులనుండియూ ఉన్న బెదిరింపు క్రింద ప్రపంచము ఉండగా–మనము ఆయన జీవమును కల్గియుండుటకును అది సమృద్ధిగా కల్గియుండుటకును క్రీస్తు వచ్చెను (యోహాను 10:10). క్రీస్తు మనకు భద్రత మాత్రమే కాదు, అయితే ఆయన మన సమాధానము కూడా అయ్యున్నాడు: “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.” (యోహాను 14:27).

నీ హృదయము కలవరపడిన యెడల ఆయన లోనికి విశ్వాసముంచుము (యోహాను 14:1). దేవుని నిత్య జీవము యొక్క భద్రత నీకు  లేకపోయినట్లయితే, దేవుని కుమారుని నామము లోనికి విశ్వాసముంచుము (1 యోహాను 5:13) మరియు ఆయన జీవమును నీకిమ్మని అడుగుము. తెరువబడిన మరియు యథార్థమైన హృదయముతో ఆయన యొద్దకు వచ్చి ఆయనకు ఇలా చెప్పుము:

ప్రభువైన యేసు, నీవు నాకు కావాలి. ప్రభువా, నీలో విశ్వాసముంచుచున్నాను. నా లోనికి రమ్ము! ఇప్పుడే నీ జీవమును ఇమ్ము. నీ సమాధానముతో నన్ను నింపుము. నా నిజమైన సమాధానముగాను భద్రతగాను ఉన్నందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను.

మరింత ఉచిత సాహిత్యము కొరకు:

www.rhemabooks.org


ఇతరులతో పంచుకొనండి